డీజీపీ వ్యాఖ్యలు సిగ్గుచేటు.. వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు..!

Sunday, January 17th, 2021, 01:30:37 AM IST

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య విగ్రహాలపై దాడుల అంశంలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏ సమాచారంతో అన్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఐడీ, సిట్ ఇచ్చిన సమాచారంతో డీజీపీ అలా మాట్లాడారా? లేక సజ్జల ఇచ్చిన సమాచారంతో అలా మాట్లాడారా అని నిలదీశారు. అంతకు ముందు రాజకీయ పార్టీల ప్రమేయం లేదని మాట్లాడిన డీజీపీ, ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధం ఉంది అని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన మంత్రి కొడాలి నాని డీజీపీకి నేరస్తుడిలా కనిపించలేదా అని వర్ల ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే నిన్న ఆలయాలపై జరుగుతున్న దాడుల గురుంచి నిన్న మీడియాతో మాట్లాడిన డీజీపీ గౌతమ్ సవాంగ్ విగ్రహాల ధ్వంసంలో కొన్ని రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని అన్నారు. విగ్రహాల ధ్వంసంలోని 9 కేసుల్లో పలువురు రాజకీయ పార్టీల నేతలు నేరుగా ప్రమేయం ఉన్నట్టు గుర్తించామని, ఇప్పటిదాకా 13 మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశామని డీజీపీ చెప్పుకొచ్చారు.