సీఎం జగన్‌కి ఆ జబ్బు ఉంది.. వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, October 28th, 2020, 02:08:06 AM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌కి జ్ఞాపకశక్తి తక్కువగా ఉందని, మతిమరుపు జబ్బు కూడా ఉన్నట్టుగా ఉందని అన్నాడు. ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకు కావాల్సినంత పోలీస్ బందోబస్త్‌ని సీఎంగా ఉన్న చంద్రబాబు కేటాయించారని గుర్తుచేశారు. అయితే లోకేశ్ పర్యటనలో మాత్రం ప్రభుత్వం కేవలం ఇద్దరు కానిస్టేబుళ్ళను మాత్రమే ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు.

అయితే లోకేశ్ రైతులను పరామర్శించడం, ట్రాక్టర్ నడపడం కూడా జగన్‌కు నేరంలా కనిపించిందని అందుకే కేసులు పెట్టించారని అన్నారు. లోకేశ్‌పై మోపిన సెక్షన్లు ఎలా వర్తిస్తాయో సీఎం జగన్ చెప్పాలని, లోకేశ్‌పై పెట్టిన కేసులన్నీ కక్షసాధింపుల్లో భాగంగా పెట్టినవే అని వర్ల చెప్పుకొచ్చారు. జగన్ తానా అంటే కొందరు అధికారులు తందానా అంటున్నారని అన్నారు. అన్నంపెట్టే రైతులకు జగన్ బేడీలు వేయించారని అన్నదాతలు ముఖ్యమంత్రి కళ్లకు టెర్రరిస్టుల్లా, నక్సలైట్లలా, నాందేడ్ గ్యాంగులా కనిపించారా అని నిలదీశారు.