ఏకగ్రీవాలు లేకుండా గెలవగలరా.. సీఎం జగన్‌కు వర్ల రామయ్య సవాల్..!

Tuesday, February 2nd, 2021, 03:52:57 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యుడు వర్లరామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను ఖండించారు. అంతేకాదు పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేకుండా సీఎం జగన్ గెలవగలరా అని సవాల్ విసిరారు. అచ్చెన్న అరెస్ట్, పట్టాభిపై దాడి చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు.

అయితే పంచాయతీ ఎన్నికలను ఏకపక్షంగా మార్చుకోవాలన్న దురుద్దేశంతోనే వైసీపీ నేతలు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయించారని అన్నారు. అంతేకాదు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో సీఎం జగన్ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, ఎంపీ విజయసాయి నిమ్మాడకు వెళ్తున్నాడనే కారణంతోనే అచ్చెన్నను అరెస్ట్ చేయించారని చెప్పుకొచ్చారు. మారణాయుధాలు, అనుచరులతో గ్రామంపైకి దాడికి వెళ్లిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌పై పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.