బీసీలు పీసీసీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది – వీహెచ్

Friday, December 18th, 2020, 02:00:40 AM IST

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల అనంతరం టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణకు కొత్త రథసారధిని నియమించే ప్రక్రియపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ మేరకు ఏఐసీసీ కసరత్తు చేపట్టింది. రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్ పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ మేరకు ఐదుగురి పేర్లతో కూడిన జాబితా కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరినట్టు తెలుస్తుంది.

అయితే టీపీసీసీ పదవి కోసం నేతల మధ్య చాలానే పోటీ ఉంది. ఇప్పటికే పలువురు నేతలు ఢిల్లీ వెళ్ళి సోనియాతో చర్చలు జరిపారు. పీసీసీ చీఫ్‌గా ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు హైకమాండ్‌ను అడిగారు. బీసీలు పీసీసీగా ఉన్నప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు ఇస్తేనే న్యాయం జరుగుతుందని సూచించారు. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని చెప్పుకొచ్చారు. ఇక నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో జానారెడ్డి చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలని పేర్కొన్నారు.