తెరాస మంత్రులు ఉపాధ్యాయ సంఘాలను పిలిచి బెదిరిస్తున్నారు – ఉత్తమ్ కుమార్ రెడ్డి

Monday, March 8th, 2021, 04:38:31 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస దిగజారి ప్రవర్తిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను బెదిరించి అధికార పార్టీ తెరాస కి చెందిన అభ్యర్ధి కి ఓటు వేయాలని ప్రమాణాలు చేయిస్తున్నారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే దీని పై వీడియోల తో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ మొత్తం వ్యవహారం పై ఎన్నికల కమిషనర్ స్పందించాలని డిమాండ్ చేశారు. అంతేకాక తెరాస మంత్రులు ఉపాధ్యాయ సంఘాలను పిలిచి బెదిరిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే వివిధ రంగాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఆలోచించాలని సూచించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది మీ ఆత్మ గౌరవానికి సంబందించిన విషయం అంటూ చెప్పుకొచ్చారు. ఏడేళ్ల తెరాస పాలన లో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలి అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. అయితే ఇటీవల జరిగిన వామన రావు దంపతుల హత్య పై రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఖండించలేదు అని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ విద్యా సంస్థలను తెరాస ప్రభుత్వం వేధించినంతగా ఏ ప్రభుత్వం కూడా ఇబ్బంది పెట్టలేదు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక జర్నలిస్ట్ లకు ఇళ్లు ఇస్తామనడం కూడా మభ్యపెట్టడమే అంటూ విమర్శించారు. పట్టభద్రుల సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పి ఓట్లు అడగాలి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.