హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీళ్లలా మారుస్తామన్నారు…ఏమైంది?

Tuesday, November 24th, 2020, 02:04:55 PM IST

తెలంగాణ రాష్ట్రం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో అధికార పార్టీ పై ప్రతి పక్ష పార్టీ నేతలు విరుచుకు పడుతున్నారు. ఇప్పటికే బీజేపీ తెరాస ను టార్గెట్ చేస్తూ వరుస విమర్శలు చేస్తుండగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వరుస ప్రశ్నలు గుప్పిస్తూ తెరాస ను తిప్పలు పెడుతుంది. ఓట్ల కోసం తెరాస అబద్ధపు హామీలు ఇస్తుంది అని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాక తెరాస హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ ఉత్తమ్ కుమార్ సూచించారు.

హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీళ్లలా మారుస్తామన్నారు ఏమైంది అంటూ సూటిగా ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు కడతామని చెప్పిన తెరాస ఇప్పటి వరకు ఎందుకు నిర్మించలేదో చెప్పలేదు అని అన్నారు. సెలూన్లకి ఉచిత విద్యుత్ హామీని గతంలో ఎన్నో సార్లు చెప్పారు అని, ఇలా మళ్లీ మళ్లీ చెప్పి ప్రజల్ని తెరాస మోసం చేస్తోంది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ పై వరుస విమర్శలతో రెచ్చిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాసను, ఆ పార్టీ మేనిఫెస్టో ను ప్రజలు చెత్తబుట్టలో వేయాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.