ఒక్క ఎకరాకు నష్ట పరిహారం చెల్లించలేదు – ఉత్తమ్ కుమార్ రెడ్డి

Tuesday, November 10th, 2020, 07:28:02 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు కల్పించేలా ఉన్నాయి అంటూ టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉత్తమ్ కుమార్. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని నిబంధనలను ప్రవేశపెట్టి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది అంటూ మండిపడ్డారు. అయితే పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే నిబంధన లేకుండా, పార్లమెంట్ లో చట్టాలను ఏకపక్షంగా ప్రవేశ పెట్టింది అంటూ ద్వజమెత్తారు.

అయితే సోనియా గాంధీ ఆధ్వర్యం లో రెండు కోట్ల సంతకాలను రాష్ట్రపతికి నవంబర్ 14 న సమర్పిస్తామని తెలిపారు. ప్రతి మండలం నుండి రెండు వేల సంతకాలను సేకరిస్తామని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ రైతులకు సన్నరకాలు వేయాలని చెప్పారు, కానీ పంట చేతికి రాగానే కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ విమర్శించారు. అయితే సన్నరకానికి కింటాకి 2,500 రూపాయలు మరియు పత్తికి తేమతో సంబంధం లేకుండా 5,800 రూపాయలు కింటా కి మద్దతు ధర చెల్లించాలి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

ప్రభుత్వ అసమర్ధత కారణం గా రైతులకు పంట భీమా లేకుండా పోయింది అని, గత భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి 13 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా, ఒక్క ఎకరాకు కూడా నష్ట పరిహారం చెల్లించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక రైతులకు లక్ష ఋణమాఫీ ఏకకాలంలో చేయాలి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.