టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండి, కాంగ్రెస్‌కు ఓటెయ్యండి – ఉత్తమ్

Saturday, October 31st, 2020, 12:04:51 PM IST

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి చరిత్ర సృష్టించబోతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దుబ్బాకలో ప్రచారం పూర్తయ్యే వరకు ప్రతి నిమిషం అమూల్యమైనదని, పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరుకు ముత్యం రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దుబ్బాక అభివృద్ధి జరిగిందని, రామలింగారెడ్డి ఏం చేయలేనప్పుడు ఆయన సతీమణి ఏం అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు.

అయితే రామలింగారెడ్డిని బ్రతికున్నప్పుడు పట్టించుకోని టీఆర్ఎస్, మరణించిన తర్వాత ఆయనపై ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్, హరీష్ రావుకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దగ్గరి బందువు అని ఆయన గెలిచినా టిఆర్ఎస్‌లోకి వెళ్తారని అన్నారు. నో ఎల్ఆర్ఎస్, నో టీఆర్ఎస్ అంటూ ఎల్ఆర్ఎస్‌ను కాంగ్రెస్ వచ్చాక ఉచితంగా చేస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కు ఓటెయ్యండని అన్నారు.