సీఎం పదవిలో కొనసాగే హక్కు కేసీఆర్‌కు లేదు – ఉత్తమ్

Tuesday, December 29th, 2020, 07:36:00 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రైతులను మోసం చేసిన కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదని అన్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పుకొచ్చారు.

అయితే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీతో సయోధ్య కుదుర్చుకున్నారని ఆరోపించారు. డెబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు ధాన్యాన్ని కొంటున్నాయని, రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనాల్సిందేనని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 7 వరకు మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టి ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అంద చేస్తామని, జనవరి 11న జిల్లా కేంద్రాల్లో నిరసన తెలుపుతామని, జనవరి 18న రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు.