ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా?

Monday, November 30th, 2020, 07:37:53 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం లో భాగం గా బీజేపీ నేతలు హైదరాబాద్ చేరుకొని పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ నేతలు హైదరాబాద్ రావడం పట్ల టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదల్లో వందమంది చనిపోతే హోమ్ మంత్రి గా పరామర్శ చేయలేదు కానీ, గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. బీజేపీ ప్రవర్తన హైదరాబాద్ ప్రజలను అవమానపరిచే విధంగా ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్ వాక్సిన్ పేరుతో డ్రామా చేస్తున్నారు అని, ఆయన రాకపోతే వాక్సిన్ తయారు కాదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే యూపీ సీఎం, ఆయన రాష్ట్రంలో దళిత మహిళ ల పై దాడులు జరుగుతుంటే మిన్నకుండి పోయారు అని, రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుంటే కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి అని ఆ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కర్ణాటక ఎంపీ వచ్చి అడ్డగోలుగా మాట్లాడతారు, యూపీ సీఎం వచ్చి హైదరాబాద్ పేరు మారుస్తాం అంటారు, మీరు ఎవరు ఆ మాట అనడానికి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం బలగాలను దింపుతారా? పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా అంటూ మండిపడ్డారు. కెసిఆర్ తెలంగాణ ను ఏడేళ్లు దోచుకున్నారు అని, సభలో ఒక్క అభివృద్ది కార్యక్రమం గురించి మాట్లాదలేదు అని అన్నారు.

తెరాస సభ అట్టర్ ఫ్లాప్ అన్న ఉత్తమ్ కుమార్, తెరాస పతనానికి గ్రేటర్ ఎన్నికలే నాంది అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ది కాంగ్రెస్ వల్లే సాధ్యం అయింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తమ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చంశనీయం కాగా, శనివారం నాటి తో ఎన్నికల ప్రచారం ముగిసింది. మరి ప్రజా నిర్ణయం ఇక ఎటువైపు అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.