టీఎస్‌టీడీసీ ‌చైర్మన్‌గా ఉప్పలను నియమించిన సీఎం కేసీఆర్..!

Saturday, November 14th, 2020, 09:16:51 AM IST

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ (టీఎస్‌టీడీసీ)గా టీఆర్ఎస్ నేత ఉప్పల శ్రీనివాస్‌గుప్తను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఉప్పల శ్రీనివాస్‌గుప్త ఆర్యవైశ్య సంఘం నాయకుడిగా కూడా ఉన్నాడు. అయితే ఉప్పల ఫౌండేషన్ పేరిట పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాడు. దీంతో ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్‌ ఆయనకు సముచిత స్థానం కల్పించారు.

అయితే తొలుత ఉప్పల శ్రీనివాస్‌గుప్తకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెడుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఓసీ కోటాలో వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్‌కు ఆ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తకు నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు. అయితే టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమితులైన ఉప్పల శ్రీనివాస్‌గుప్తకు పలువురు నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.