ఏపీలో దేవాలయాలపై ఆగని దాడులు.. కర్నూల్‌లో మరో ఘటన..!

Tuesday, October 6th, 2020, 02:15:54 PM IST

ఏపీలో హిందూ దేవాలయాలపై, దేవుళ్ల విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులు ఆగడం లేదు. అంతర్వేది రథం, కనకదుర్గమ్మ వెండి రథం సింహాలు మాయమవ్వడం మొదలుకుని ఏదో ఓ చోట దేవాలయాలపై దాడులు, విగ్రహాలు ధ్వంసమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా కర్నూల్ జిల్లాలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

మంత్రాలయం మండలం వగరూరు చెరువు కట్ట నరసప్పతాత విగ్రహంపై ఉండే శేషపడగలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. వగరూరుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూగూరు జలాశయం దగ్గర ఈ ఆలయం ఉంటుంది. అయితే వారంలో సోమ, గురువారాలు మాత్రమే ఇక్కడకు పూజారి వచ్చి పూజలు చేస్తారు. అందులో భాగంగా నిన్న స్వామి వారికి పూజ చేద్దామని పూజారి గుడి తలుపులు తీయగానే స్వామి వారి విగ్రహంపైన ఉండే తొమ్మిది శేషపడగల్లో నాలుగింటి తలలు ముక్కలుగా పడి ఉన్నాయి. ఇది చూసి షాక్‌కి గురైన పూజారి స్థానికులకు విషయం తెలిపాడు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.