మూసేస్తాం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మరో కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, March 10th, 2021, 03:02:15 AM IST


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటూ నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారమన్ లిఖిత పూర్వక సమాధానం ఇవ్వడంతో ఏపీలో నిరసనలు మరింత ఉదృతమయ్యాయి. మొన్నై వరకు శాంతియుతంగా ఆందోళనలు చేసిన కార్మిక సంఘాలు నిన్నటి నుంచి ఉద్యమాన్ని సెగలు కక్కిస్తున్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతున్నా కూడా కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు.

తాజాగా ప్రైవేటీకరణ ఆగేది లేదని మరో కేంద్ర మంత్రి కూడా కుండబద్దలు కొట్టేశారు. ఉక్కు కర్మాగారాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో భాజపా ఎంపీ సస్మిత్‌ పాత్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రానిపక్షంలో వాటిని మూసివేయ డానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రైవేటీకరణ విభిన్న అంశాలపై ఆధారపడి ఉంటుందని, ఐదేళ్లలో 5 ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.