విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడండి.. జగన్, చంద్రబాబుకు ఉండవల్లి సజేషన్..!

Monday, February 8th, 2021, 06:25:12 PM IST

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రతిపాదనను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. నేడు మీడియాతో మాట్లాడిన ఉండవల్లి వేలాది మంది కార్మికులకు ఉపాధినిస్తున్న స్టీల్ ప్లాంట్‌ను నష్టాల పేరిట అమ్మకానికి పెట్టడం దారుణమని అన్నారు. ఉక్కు కర్మాగారం మనుగడ సాధించాలంటే దాని పరిధిలో ఉన్న మైన్లను స్టీల్ ప్లాంట్‌కే కేటాయించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మగారాన్ని ప్రైవేట్ పరం చేస్తే దానికి సంబంధించిన భూములను యజమానులు రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి అమ్మకానికి పెడతారని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్య ఘంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడం శుభపరిణామమని ఉండవల్లి అన్నారు. అయితే అన్ని రాజకీయ పార్టీలు కలిసి విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విశాక స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కొట్లాడాలని, విబేధాలు పక్కనపెట్టి ఉక్కు కర్మాగారానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో పాల్గొనాలని సూచించారు.