సీపీఐ కార్యాలయంపై దాడి చేసిన దుండగులు..!

Monday, September 14th, 2020, 07:33:59 AM IST

సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉన్న సీపీఐ కార్యాలయం లోపలికి వెళ్ళిన దుండగులలో ఒక వ్యక్తి తెలుగు అకాడమీ ఎక్కడ అని ఆరా తీస్తుండగా, మరో వ్యక్తి పెద్ద కర్రతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి చెందిన ఇన్నోవా వాహనంపై దాడికి దిగాడు. ఈ దాడిలో కారు ముందు వైపు, ఎడమ వైపు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

అయితే కారు అద్దాలు ధ్వంసం చేసిన వెంటనే అగంతకులు బైకుపై అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని కార్యాలయ సిబ్బంది సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి తెలియజేయడంతో వారు హుటాహుటిన కార్యాలయాలనికి చేరుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని చాడ వెంకట్ రెడ్డి డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్‌కు ఫోన్ ద్వారా తెలియచేశారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.