ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..!

Thursday, February 11th, 2021, 05:30:44 PM IST

ఏపీ, తెలంగాణలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 14న పోలింగ్ జరగనుంది. అయితే నామినేషన్‌ దాఖలుకు ఫిబ్రవరి 23 వరకు గడువు ఉంది. ఇక నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 24న జరగనుండగా నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు గడువు విధించారు.

ఇక మార్చి 14న ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, మార్చి 17న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక కూడా త్వరలో జరగబోతుంది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మరింత పెరిగింది.