162 ప్రాణాల ఖరీదు రెండు నిముషాలు

Wednesday, December 31st, 2014, 04:44:20 PM IST


ఇండోనేషియా నుండి సింగపూర్ ప్రయాణించే ఎయిర్ ఏషియా విమానం మార్గం మధ్యలోనే జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విమాన ప్రమాదం సంభవించడానికి ముందు జరిగిన కొన్ని ఆశక్తికర విషయాలు ప్రస్తుతం వెలుగు చూస్తున్నాయి. కాగా ఒక్క రెండు నిమిషాల పాటు ఆదేశాలు జారీ చెయ్యడానికి చేసిన ఆలస్యం 162మంది ప్రాణాలను బలి తీసుకుందని తెలుస్తోంది.

వివరాలలోకి వెళితే ప్రమాదానికి ముందు వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని అందువల్ల తాను ఎడమవైపు తిరిగి మరికొంత ఎత్తు నుండి వెళతానని ఏటీసీని పైలెట్ ఇర్యాంటో కోరారు. అందుకు ఏటీసీ అనుమతినివ్వడంతో ఆ విధంగా ఏడు మైళ్ళ దూరం ప్రయాణించారు. అటుపై 38వేల అడుగుల ఎత్తులో వెళతానని ఆయన కోరగా అందుకు ఎయిర్ ట్రాఫిక్ వెంటనే అవునని చెప్పలేకపోయింది. అందుకు కారణం ఆ ఎత్తులో మరో ఆరు విమానాలు ప్రయాణించడమే. ఇక సరిగ్గా 6.14గంటలకు ఎయిర్ ఏషియాకు ఎత్తులో ప్రయాణించమని ఏటీసీ అనుమతినివ్వగా, ఆ ఆదేశాలకు తిరిగి సమాధానం రాలేదు. అయితే ఆ సమయానికే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ సంభాషణ అంతా తాజాగా విడుదలైన ట్రాన్ స్క్రిప్ట్ లో తెలియపరచబడింది.