గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు ఒక్కొక్కటిగా తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా టీటీడీపీ కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ మేనిఫెస్టోను ప్రకటించిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. మాయ మాటలు చెప్పే టీఅర్ఎస్ పార్టీ కావాలో, అభివృద్ధి చేసే తెలూగు దేశం పార్టీ కావాలో గ్రేటర్ ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు.
అంతేకాదు తాము మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా అందిస్తామని, పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్ ఇస్తామని ఎల్. రమణ చెప్పుకొచ్చారు. ప్రతి ఇంటికి పైపులైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తామని అన్నారు. ప్రతి పేదవారికి పక్కా గృహాలు నిర్మిస్తామన్నారు. పూర్తి స్థాయిలో హైదరాబాద్‌ను వైఫై నగరంగా చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని అన్నారు.