నా కాలేజీ రోజుల్లో చిరంజీవి పాటలకు స్టెప్పులేసేవాడిని – మంత్రి పువ్వాడ అజయ్

Tuesday, March 9th, 2021, 08:32:51 AM IST

ఖమ్మం జిల్లాలో మమత ఆసుపత్రి మైదానం లో శ్రీకారం ప్రీ రిలీజ్ వేడుక లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం ఈ వేడుక లో పాలు పంచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి కి తాను పెద్ద అభిమాని అంటూ చెప్పుకొచ్చారు. నా కాలేజీ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి పాటలకు స్టెప్పులేసే వాడిని అని మంత్రి అజయ్ కుమార్ వేడుక లో తెలిపారు. చిన్నప్పటి నుండి కూడా చిరంజీవికి తాను వీరాభిమానినని చెప్పుకొచ్చారు. ఆయన అందరికీ అన్నయ్య లాంటి వారు అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే మంత్రి కేటీఆర్ హీరో రామ్ చరణ్ కి మంచి మిత్రుడు అని అన్నారు. చిరంజీవికి ఎలాంటి అసౌకర్యం కలగకుండాచూసుకోవాలని తనను ఆదేశించారు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ సందర్భంగా తన నివాసం లోనే ఆతిథ్యం ఇస్తున్నట్లు తెలిపారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి అటు పక్క ఆచార్య చిత్ర షూటింగ్ లో పాల్గొని, ఇటు ప్రీ రిలీజ్ వేడుక కి హాజరు కావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా పై మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాక 12 ఏళ్ల క్రితం ప్రజా అంకిత యాత్రకి ఖమ్మం వచ్చినప్పుడు అనూహ్య స్పందన లభించింది అని, అదే ప్రేమ, అభిమానం చెక్కు చెదరలేదు అంటూ చెప్పుకొచ్చారు.పోరాటాల ఖిల్లా ఖమ్మం కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు.