ఇవాళ విశాఖ ఉక్కు, రేపు సింగరేణి ను కూడా ప్రైవేట్ పరం చేస్తామంటారు – మంత్రి కేటీఆర్

Friday, March 12th, 2021, 04:12:44 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయం లో తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. అవసరం అయితే విశాఖ వెళ్లి మరీ ఉద్యమానికి మద్దతు ఇస్తామని కేటీఆర్ అన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలను పలువురు తప్పు బడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మేరకు మరొకసారి ఈ అంశం పై కేటీఆర్ స్పందించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతిస్తే ఆంధ్ర ప్రదేశ్ విషయాలు నీకెందుకు అంటూ ప్రశ్నిస్తున్న కొందరిని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ దేశం లో ఒక రాష్ట్రం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ను తుక్కు చేసి అమ్మేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఇవాళ విశాఖ ఉక్కు పై పడ్డారు రేపు సింగరేణి ను కూడా ప్రైవేట్ పరం చెస్తామంటారు అని వ్యాఖ్యానించారు. ఏపీ విషయం లో నోరు మూసుకొని కూర్చోమని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. అయితే రేపు తెలంగాణ కి కష్టం వస్తే మా వెంట ఎవరుంటారు అని ప్రశ్నించారు. మేం మొదట భారతీయులం అని, ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం లో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఆలోచించాలి అని వ్యాఖ్యానించారు.

మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి మాత్రమే కాకుండా విశాఖ ఉక్కు ఉద్యమానికి పలువురు ప్రముఖులు సైతం మద్దతు తెలుపుతున్నారు. అయితే దీని పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారం పై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనే దాని పై అంతా ఎదురు చూస్తున్నారు. ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకసారి మోడీ కి లేఖ రాసిన విషయం అందరికి తెలిసిందే.