బీజేపీ దగ్గర విషయం లేదు…అందుకే విషం చిమ్ముతున్నారు

Monday, November 23rd, 2020, 07:31:12 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావడం తో అధికార పార్టీ, ప్రతి పక్షాలు ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ఈ సారి హైదరాబాద్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనీ చూస్తుండగా, ఈసారి కూడా తాము హైదరాబాద్ కోసం చేపట్టిన కార్యక్రమాలను, పనులను చూపిస్తూ తెరాస మరొకసారి విజయం సాధించాలానీ భావిస్తోంది. అయితే ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయం లో బీజేపీ తీరును ఎండగడుతూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వరుస విమర్శలు చేశారు.

ఎవరైనా మేమిది చేశాం, ఇంకా ఇవి చేస్తామని చెప్పి ఓట్లు అడుగుతారు అని, కానీ బీజేపీ దగ్గర విషయం లేదు అంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ కి చేసిందేమీ లేదు అని తెలిపారు. అందుకే విషం చిమ్ముతున్నారు అని అన్నారు. ఆరేళ్ళ గా ప్రశాంతంగా ఉన్న నగరం లో నాలుగు ఓట్ల కోసం మతం పేరిట చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఎన్నిక అయినా ప్రజల మనోగతాన్ని ప్రతిబింబిస్తుంది అని, 74 లక్షల మంది ఓట్లు వేసే గ్రేటర్ ఎన్నిక ప్రజాభిప్రాయానికి ప్రతీక కాదు అని ఒక రాజకీయ నాయకుడిగా తాను అంటే అది తప్పే అని, కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమైనవే అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.

అయితే ఈ ఎన్నికలను భూతద్దం లో చూడాల్సిన పని కానీ, విస్మరించాల్సిన అవసరం కానీ లేదు అని, అన్ని ఎన్నికల మాదిరిగానే గ్రేటర్ ఎన్నిక కూడా ప్రజల మనోగతాన్ని ప్రతిబింబిస్తుంది అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే మేము పని చేశాం కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు మాకు బలమైన మెజారిటీ ఇస్తారు అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ కూడా తన సత్తా చూపేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే డబ్బుల ఉపఎన్నిక విజయం తో తెలంగాణ లో బీజేపీ తన హవాను కొనసాగించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.