అవసరమైతే తప్ప బయటికి రావొద్దు…ప్రజలకు మంత్రి ఈటెల సూచనలు!

Tuesday, March 23rd, 2021, 08:30:27 AM IST

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి ని అరికట్టడం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వివరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రజల సంపూర్ణ భాగస్వామ్యం తోనే కరోనా కట్టడి సాధ్యం అని వ్యాఖ్యానించారు. కోవిడ్ పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించ వద్దు అని హితవు పలికారు. తప్పని సరిగా మాస్క్ ధరించాలి అని, భౌతిక దూరం పాటించాలి అని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా అదుపులోనే ఉందని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది అని వ్యాఖ్యానించారు. అయితే కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని, రోజుకి 50 వేల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని వెల్లడించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.