సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఆపడం పై హైకోర్ట్ ఆగ్రహం!

Tuesday, May 11th, 2021, 12:30:16 PM IST


కరోనా వైరస్ మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాల తో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ ను కట్టడి చేయడం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై రాష్ట్ర హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. అంతేకాక సరిహద్దుల్లో అంబులెన్స్ వాహనాలను ఆపడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలను నిలిపి వేయడం మానవత్వమేనా అంటూ సూటిగా ప్రశ్నించడం జరిగింది. అయితే ఏ అధికారం తో సరిహద్దుల వద్ద అంబులెన్సు లు ఆపారు అంటూ నిలదీసింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్తితుల పట్ల హైకోర్టు నేడు విచారణ జరిపింది. రాత్రి కర్ఫ్యూ సరిగ్గా అమలు కావడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది.

అయితే రంజాన్ తర్వాతే కరోనా కట్టడి పై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా అంటూ మండిపడింది. అయితే మతపరమైన ప్రదేశాల్లో జన సమీకరణ ఆమోదయోగ్యం కాదు అని తెలిపింది. మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించడం లేదు అంటూ సూటిగా ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం చెప్పే విషయాలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేదని తెలిపింది. కరోనా వైరస్ పరీక్షలను పెంచాలి అంటూ ఆదేశాలను జారీ చేస్తే, ఇంకా తగ్గిస్తారా అని హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. కోర్ట్ ఆదేశాలను బుట్ట దాఖలు చేయడం బాధాకరం అంటూ చెప్పుకొచ్చింది. అయితే అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిపింది. అయితే కరోనా నియంత్రణ తదుపరి చర్యలు ఏంటో చెప్పాలి అంటూ సూటిగా ప్రశ్నించింది.