టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత .. షర్మిలకు మద్దతు..!

Monday, February 22nd, 2021, 04:48:53 PM IST

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు అధికార పార్టీ టీఆర్ఎస్‌కి మరో షాక్ తగిలింది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ బుద్వేల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కె.ఎస్‌. దయానంద్‌(డేవిడ్‌) తన పదవికి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామా లేఖను రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌కు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డికి పంపించినట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే రాజీనామా అనంతరం కె.ఎస్‌. దయానంద్ తన అనుచరులతో కలిసి లోటస్‌ పాండ్‌లో వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ కూతురు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుండడం శుభపరిణామమని ఆమె ఏర్పాటు చేయబోయే పార్టీకి తాము మద్దతిస్తున్నట్టు కె.ఎస్‌. దయానంద్‌ ప్రకటించారు.