బిగ్ షాక్: టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన కీలక నేత..!

Friday, February 12th, 2021, 03:23:49 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తెరాస రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి తనయుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. మంథనిలో తెలంగాణ ఉద్యమాన్ని తాను ముందుండి నడిపించానని, రెండు సార్లు టీఆర్ఎస్ తరఫున మంథని ఎమ్మెల్యే టికెట్ తనకు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సూచనల మేరకు ఇన్ని రోజులు పార్టీలో ఉన్నట్టుగా తెలిపారు.

అయితే ఇన్ని రోజులు పార్టీలో ఉన్నా తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, తనను నమ్ముకుని పార్టీలో ఉన్న వారికి కూడా ఎలాంటి సహాయం చేయలేకపోతున్నానని చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు యువతకు చాలా అన్యాయం చేశారని ఆరోపించారు. మంథని నియోజకవర్గంలో చాలా మంది మార్పు కోరుకుంటున్నారని అనుచరులతో చర్చించి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తానని అన్నారు. పదవి ఉన్న, లేకున్నా తన వెంట వచ్చిన కార్యకర్తలకు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు.