నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు..!

Monday, March 29th, 2021, 03:38:57 PM IST

తెలంగాణలో ఇటీవల జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు కూడా సిద్దమవుతుంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని వ్యూహత్మకంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న అంశానికి తెరదించింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కే టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

అయితే మరికాసేపట్లో నోముల భగత్ పేరును అధికారికంగా ప్రకటించడమే కాకుండా, పార్టీ తరపున సీఎం కేసీఆర్ ఆయనకు బీ ఫామ్ అందించబోతున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు రేపు చివరి రోజు కావడంతో నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ రేపు ఉదయం నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ తరపున నాగార్జునసాగర్ టికెట్ ఆశించిన మంత్రి జగదీష్ రెడ్డి సన్నిహితుడు కోటిరెడ్డిని ఆ పార్టీ నేతలు బుజ్జగించినట్టు సమాచారం. ఆయనకు మరో విధంగా న్యాయం చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ద్వారా హామీ ఇప్పిస్తామని చెప్పునట్టు తెలుస్తుంది.