గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌..!

Friday, March 19th, 2021, 05:42:38 PM IST

తెలంగాణలో ఈ నెల 14వ తేదిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ మరియు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు రోజులుగా వీటి ఫలితాల కౌంటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంగ ఓటు వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న తన తోటికోడలు పేరుతో నమోదైన ఓటును తన ఓటుగా వినియోగించుకుని ఓటు వేశారు. ఓటరు ఇంటి పేరు స్వప్న ఇంటి పేరు ఒకటే కావడంతో ఆమె ఎవరికి అనుమానం రాకుండా ఓటును వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై విపక్షాలు ఎన్నికల కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమీషనర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్‌ ఆమె దొంగ ఓటు వేసినట్లు తేల్చారు. దీంతో చైర్‌పర్సన్ పదవికి స్వప్న రాజీనామా చేయాలని బల్దియా ఆఫీసు ఎదుట విపక్షాల ఆందోళనకు దిగాయి. ఓ ప్రజాప్రతినిధి, అధికార పార్టీ నాయకురాలు ఇలా దొంగ ఓటు వేయడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.