బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ..!

Friday, January 29th, 2021, 02:00:46 AM IST

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత తెలంగాణలో బీజేపీ జోష్ పెంచింది. ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలకు గాలం వేస్తూ రాష్ట్రంలో మరింత బలపడాలని చూస్తుంది. అయితే త్వరలోనే జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో గతంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

అయితే ప్రస్తుతం తేరా చిన్నపరెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి బీజేపీ ముఖ్యనేతలను కలిశారని నాగార్జునసాగర్ టికెట్ హామీ ఇస్తే బీజేపీలో చేరుతానని చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన తేరా చిన్నపరెడ్డి వాటిని ఖండించారు. కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌ పార్టీకి తాను విధేయుడునని తనను బీజేపీ నేతలు సంప్రదించారనేది నిజం కాదని, తాను కూడా ఎవరితోనూ చర్చలు జరపలేదని ఆయన చెప్పుకొచ్చారు.