ఇప్పుడే వద్దు.. గ్రేటర్ ఎన్నికలకు భయపడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!

Friday, November 6th, 2020, 03:06:05 AM IST

త్వరలో రానున్న గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినబడుతున్నాయి. ఎన్నికలేవైనా టీఆర్ఎస్‌దే విజయం అని చెప్పుకునే టీఆర్ఎస్ నేతలు రాబోయే గ్రేటర్ ఎన్నికలను ఎదురుకునేందుకు సమయం కావాలని అడుగుతున్నారట. అందుకే ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ పునరాలోచనలో పడిందని టాక్ వినబడుతుంది. ఇటీవల అగర పరిధిలో సంభవించిన వరదల నుంచి నగరవాసులు పూర్తిగా కోలుకోకముందే ఎన్నికలకు వెళ్తే ఆ ప్రభావం ఫలితాలపై చూపే అవకాశం ఉంటుందని పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కేటీఆర్‌కు వివరించినట్టు సమాచారం.

అయితే వరదల కారణంగా రోడ్లు, డ్రైనేజీలు చాలా వరకు దెబ్బతిన్నాయని మరియు వరద బాధితులకు 10 వేల చొప్పున పరిహారం పంపిణీ కూడా గందరగోళంగా మారిందని ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్‌ ఎన్నికలకు తొందరపడకపోవడమే మంచిదని నేతలు కేటీఆర్‌కు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో పరిస్థితి కుదుటపడిన తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలన్న విషయాన్ని గ్రేటర్ ఎమ్మెల్యేలు కేటీఆర్ ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ ఓకే చెబితే డిసెంబర్‌ నెలాఖరులో ఎన్నికల షెడ్యూలు విడుదల చేసి జనవరి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తుంది.