నిన్న, మొన్న వచ్చిన వారికే మంత్రి పదవులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

Friday, February 19th, 2021, 04:41:53 PM IST

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు జనగామలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్ అయిన తనకు ఇంత వరకు మంత్రి పదవి రాలేదని పార్టీలోకి నిన్న మొన్న వచ్చిన వారికే మంత్రి పదవులు వచ్చాయని అన్నారు. అయితే తనకు పదవులు రాలేదని బాధలేదని తాను తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు, పార్టీకి విధేయుడిగా ఉంటానని ముత్తిరెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే సీఎం కేసీఆర్ వల్లే తాను ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నానని, ఇక నుంచి తనకు పార్టీ శ్రేణులు చెప్పిందే వేదమని వారు సూచించిన వారికే ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. అయితే జనగామ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉద్దేశించే ముత్తిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్‌లో సీనియర్ అయిన తనను కాదని, తన తరువాత పార్టీలోకి వచ్చిన ఎర్రబెల్లికి మంత్రి పదవి దక్కడంపై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అసంతృప్తితో ఉన్నారనే చర్చ చాలాకాలంగా జరుగుతుంది.