తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..!

Friday, December 25th, 2020, 01:00:52 AM IST

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండగా, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడింది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నెమ్మదిగా పట్టును కోల్పోతున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. త్వరలో మంత్రి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే అవకాశముందని చెప్పుకొచ్చారు.

అయితే గ్రేటర్ ఎన్నికలకు ముందే ఈ అంశంపై అనేక ఊహాగానాలు వినబడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల వల్ల దేశానికి ఒరిగిందేమి లేదని, త్వరలోనే కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలను కలిసి ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుపై చర్చిస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో ఇక ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారని, ఇప్పటికే పార్టీ పగ్గాలను కేటీఅర్‌కు అప్పచెప్పిన కేసీఆర్ సీఎం పదవిని కూడా కట్టబెడుతున్నారని ప్రచారం జరిగింది. అయితే టీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికలలో ఆశించినన్ని స్థానాలు రాకపోవడంతో ఇక కేటీఆర్ ఇప్పట్లో సీఎం అయ్యే ఛాన్స్ లేనట్టే అని అంతా కూడా దీనిపై సైలెంట్ అయిపోయారు. ఇలాంటి తరుణంలో ఈ అంశంపై ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.