డబ్బులు కూడా ఇద్దాం.. వైరల్‌గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాటలు..!

Saturday, March 13th, 2021, 03:06:37 PM IST

తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పి ఎదురయ్యింది. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇటీవల కార్యకర్తలతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఓటర్లకు డబ్బులు పంచండంటూ మాట్లాడారు.

అయితే ఓటర్లను ఎ, బి, సీ గా విభజించండని వారిలో మనకు ఓట్లు వేసే వారు, కొంత డవుట్ ఫుల్ గా ఉన్నవారు, అదే విధంగా ఓట్లు వేయరనుకున్న వారిని గుర్తించాలని కార్యకర్తలకు సూచించారు. అంతేకాదు ఆఫ్ ద రికార్డ్ చెపుతున్నా ఓటర్లకు డబ్బులు కూడా ఇద్దామని.. భయమేమి లేదని అన్నారు. అంతేకాదు మనమిచ్చే డబ్బులు ఖర్చులకు పనికొస్తాయని అన్నారు. అయితే ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.