సంక్షేమ పథకాలన్ని రద్దు చేయాలి.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Tuesday, December 15th, 2020, 05:52:46 PM IST

టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మారెడ్డి సభలో మాట్లాడుతూ జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటు ఉందని అన్నారు. ఏడాదిపాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరాలని తనకు ఉందని అన్నారు.

అంతేకాదు 24 గంటల ఉచిత కరెంట్ కోతలు పెట్టి కేవలం 3, 4 గంటలు కరెంట్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలన్నిటిని ప్రస్తుతం నిలిపివేసి ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే లక్ష్మారెడ్డి 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మారెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక మొదట విద్యుత్ శాఖ మంత్రిగా ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నుంచి మరోసారి లక్ష్మారెడ్డి గెలుపొందిన కేబినెట్‌లో మాత్రం చోటు దక్కలేదు.