తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా దొంగ ఓటు వేశారట?

Monday, March 22nd, 2021, 04:42:20 PM IST

తెలంగాణలో ఈ నెల 14వ తేదిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ మరియు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగ్గా, మొన్ననే వీటి ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇదిలా ఉంటే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో తాండూరు టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న దొంగ ఓటు వేశారని దుమారం రేగిన సంగతి తెలిసిందే. తన తోటికోడలు పేరుతో నమోదైన ఓటును మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న తన ఓటుగా వినియోగించుకున్నారని విచారణలో కూడా తేలింది.

అయితే తాజాగా తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓటు వేశాడని వికారాబాద్ జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పైలెట్ శిక్షణ పొందిన రోహిత్ రెడ్డి మన దేశంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదని, అలాంటప్పుడు ఇక్కడ అర్హత లేని చదువుతో ఓటు వేసిన రోహిత్ రెడ్డిది కూడా దొంగ ఓటేనని ఆయన విమర్శించారు. అంతేకాదు ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమీషన్‌తో పాటు శాసనసభ స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని అన్నారు.