టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు..!

Monday, February 1st, 2021, 11:54:12 PM IST


టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ఇటీవల అయోధ్య రామాలయ నిర్మాణ కోసం బీజేపీ నేతలు సేకరిస్తున్న విరాళాలపై చల్లా ధర్మారెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం ఇంకా మరిచిపోకముందే మరో వివాదానికి ఆయన తెరలేపారు. తాజాగా ఓసీ మహాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ చిన్న కులాల అధికారులకు అక్షరం ముక్క రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు ఏ ఆఫీసుకు వెళ్ళినా వారే ఉన్నతాధికారులుగా ఉన్నారని, ఇలాంటి వారి కారణంగానే రాష్ట్రం నాశనమవుతుందని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉంటే అయోధ్యలో రామాలయ నిర్మాణ నిధుల సేకరణకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తనపై బురదజల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు.