గ్రేటర్ ఎన్నికల్లో ప్రచార పర్వం జోరుగా సాగుతుంది. ఈ నేపధ్యంలో నేతలందరూ తమ ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏపీలో రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదని అన్నారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీలో లేడని, అలాంటి వ్యక్తిని బీజేపీ అడుక్కుంటుందంటేనే వారి సామర్ధ్యం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుందని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు.
అంతేకాదు బీజేపీ నేతలు అసత్యాలు మాట్లాడుతూ, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆరేళ్లలో చేసిన అబివృద్ధి గురుంచి మాట్లాడేందుకు తాను సిద్దమని, బీజేపీ రాష్ట్రానికి, హైదరాబాద్‌కు ఏం చేసిందో చెప్పగలరా అని సవాల్ విసిరారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. దమ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాలని సవాల్ చేశారు. బీజేపీలో గెలిచిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారుని, నిజామాబాద్‌లో పసుపు బోర్డ్ వచ్చిందా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌కు గ్రేటర్ ప్రజలు తగిన బుద్ది చెప్తారని అన్నారు.