మేయర్‌పై టీఆర్ఎస్ కసరత్తు.. తెరపైకి సింధు ఆదర్శ్ రెడ్డి పేరు..!

Saturday, December 5th, 2020, 02:00:49 AM IST

గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలు దక్కలేదు. అనూహ్యంగా గ్రేటర్ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడంతో టీఆర్ఎస్ కేవలం 55 స్థానాలలో గెలిచింది. దీంతో టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే ఖచ్చితంగా ఎంఐఎంతో చేతులు కలిపే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ముందు మేయర్‌ అభ్యర్థిని ఖరారు చేసే పనిలో టీఆర్ఎస్ నిమగ్నమయినట్టు తెలుస్తుంది. అయితే మేయర్ పదవి ఈసారి మహిళలకు రిజర్వ్ అయిన నేపథ్యంలో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందా అన్న చర్చ జోరుగా జరుగుతుంది.

అయితే మేయర్ రేస్‌లో భారతి నగర్ డివిజన్ నుంచి గెలుపొందిన సింధు ఆదర్శ్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. ఆమెతో పాటు ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి కూడా రేసులో ఉన్నప్పటికి అధిష్టానం మాత్రం సింధురెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2016 ఎన్నికల్లోనూ సింధూరెడ్డి భారతి నగర్ డివిజన్ నుంచే గెలిచారు. వరుసగా రెండు సార్లు ఆమె గెలవడంతో ఆమెకు అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే భారతినగర్ డివిజన్ ఫలితం వెలువడిన కాసేపటికే సింధు రెడ్డికి ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడంతో కాబోయే మేయర్ సింధు రెడ్డి అనే ఊహాగానాలు ఎక్కువైపోయాయి.