బిగ్‌న్యూస్: టీఆర్ఎస్‌కి టీకేఆర్ షాక్ ఇవ్వబోతున్నాడా?

Friday, November 6th, 2020, 05:23:21 PM IST

గ్రేటర్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందస్తుగానే పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్‌ పార్టీకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి షాక్ ఇవ్వబోతున్నారన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఆయాన టీఆర్ఎస్ పార్టీనీ వీడి బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీ నేతలతో ఆయన చర్చలు కూడా జరిపారని, త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారని తెగ ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా టీఆర్‌ఎస్‌కు తీగల కృష్ణారెడ్డి దూరంగా ఉంటున్నారు. 2014 ఎన్నికలలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తీగల కృష్ణారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే 2018 ఎన్నికలలో మరోసారి మహేశ్వరం నుంచి పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సభితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సభిత టీఆర్ఎస్‌లో చేరడంతో ఏకంగా ఆమెకు సీఎం కేసీఆర్ మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో అప్పటి నుంచి తీగలకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెల్కొన్నాయి. ఇక టీఆర్ఎస్‌లో ఉంటే ఫలితం లేదని భావించిన తీగల బీజేపీలోకి దూకేందుకు రెడీ అయినట్టు టాక్.