గ్రేటర్ ఎన్నికల సమయంలో అధికార పార్టీ టీఆర్ఎస్కు షాక్ తగిలింది. టీఆర్ఎస్ కీలక నేత, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో స్వామిగౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ బీజేపీ నేతల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తుంది.
అయితే టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న స్వామిగౌడ్ గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. స్వామిగౌడ్‌తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ సమావేశమై ఆయనను బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్టు ప్రచారం జరిగింది. అయితే కొద్ది రోజులుగా దీనిపై సైలెంట్‌గా ఉంటూ వస్తున్న స్వామిగౌడ్ దుబ్బాక ఫలితాన్ని బేరీజు వేసుకుని బీజేపీలో చేరేందుకు సిద్దమైనట్టు తెలుస్తుంది.