రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లులు కురిపించిన టీఆర్ఎస్ నేత..!

Monday, August 24th, 2020, 07:18:22 AM IST

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పొగడ్తల వర్షం కురిపించారు. బోయిన్‌పల్లిలో సర్వాయి పాపన్న విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటు స్వామిగౌడ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్వామి గౌడ్ రేవంత్ రెడ్డి అగ్రకులంలో పుట్టినా కూడా వెనుకబడిన కులాల వారికి అండగా నిలుస్తున్నారని బడుగు, బలహీనవర్గాలకు అండగా ఉంటున్న రేవంత్ రెడ్డికి మనం కూడా అండగా నిలవాలని అన్నారు.

ఇక ఇది పక్కన పెడితే ఎన్నికలలో డబ్బులున్న వారికే పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని యువత రాజకీయాల్లోకి రావాలి, కొత్త రాజకీయాలకు రూపుదిద్దాలని అప్పుడే ప్రజాస్వామ్యం నిలుస్తుందని అన్నారు. అయితే రేవంత్ రెడ్డి కూడా స్వామి గౌడ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ ల పాత్ర చాలా ఉందని సమైక్య పాలనలో స్వామి గౌడ్ మీద దాడి చేసిన అధికారులకే ఈ రోజు గుర్తింపు ఉందని, బడుగు బలహీన వర్గాల బిడ్డ స్వామిగౌడ్ కి ఈ రోజు గుర్తింపు కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.