గ్రేటర్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత..!

Tuesday, November 17th, 2020, 01:29:22 AM IST

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీలో మరింత జోష్ పెరిగింది. టీఆర్ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అని భావిస్తున్న బీజేపీ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే ఊపును కొనసాగించాలని పావులు కదుపుతుంది. ఈ నేపధ్యంలో వివిధ పార్టీల్లోని ముఖ్య నేతలకు గాలం వేసి పార్టీలో చేర్చుకుంటుంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది.

ఎల్బీనగర్ టీఆర్ఎస్ నాయకుడు జిట్టా సురేందర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమక్షంలో జిట్టా కాషాయ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎల్‌బీనగర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ రేవంత్‌రెడ్డి అనుచరుడు కొప్పుల నరసింహారెడ్డి కూడా బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. దుబ్బాక గెలుపుతో టీఆర్‌ఎస్‌కు సవాల్‌గా నిలిచిన బీజేపీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కసరత్తు చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఇన్‌చార్జిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ను నియమించిన అధిష్ఠానం, తాజాగా గ్రేటర్‌ ఎన్నికల కోసం ప్రత్యేకంగా మరో జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్‌ను ఇన్‌చార్జిగా ప్రకటించింది.