విశ్లేషణ: గ్రేటర్‌లో సెంచరీ నుంచి హాఫ్ సెంచరీకి పడిపోయిన టీఆర్ఎస్ గ్రాఫ్..!

Sunday, December 6th, 2020, 12:30:16 AM IST

గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. 2016 ఎన్నికలలో 99 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ సెంచరీ మిస్ అయ్యిందని ఈ సారి ఖచ్చితంగా సెంచరీ కొడతామని ధీమా వ్యక్తం చేసింది. అయితే కారు స్పీడుకు ఈ సారి కమలం అడ్డుపడడంతో టీఆర్ఎస్ గ్రాఫ్ సెంచరీ నుంచి హాఫ్ సెంచరీకి పడిపోయింది. అయితే ఏడేళ్ళుగా ఎదురులేకుండా దూసుకుపోతున్న కారు జోరు తగ్గడానికి కారణాలేమిటి, కేసీఆర్ వ్యూహం గ్రేటర్ ఎన్నికలపై ఎందుకు పనిచేయలేదు, ఫలితాల ఎఫెక్ట్ కేటీఆర్ భవితవ్యంపై ఏమైనా ప్రభావం చూపనుందా అనే విషయాలను తెలుగు ఇన్ క్లుప్తంగా విశ్లేషించింది.

జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలన్ని తలకిందులయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలలో దాదాపు అన్ని సంస్థలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టాయి. కానీ మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. 2016 గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ 99 స్థానాలను గెలుచుకుంటే ఈ సారి మాత్రం కేవలం 55 స్థానాలకే పరిమితమయ్యింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 4 స్థానాల నుంచి 48 స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే టీఆర్ఎస్‌కు ఇంతలా నష్టం జరగడానికి గల పలు ప్రధాన కారణాలను తెలుసుకుందాం.

దుబ్బాక ఎఫెక్ట్:

దుబ్బాక ఫలితం కూడా గ్రేటర్ ఎన్నికలపై ప్రభావం చూపినట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దుబ్బాకలో బీజేపీ గెలిచినప్పటి నుంచి ఆ పార్టీ ఫుల్ జోష్‌లో కనిపించింది. అదే ఊపుతో గ్రేటర్ ఎన్నికలలో కూడా బీజేపీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పనిచేయడంతో టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఆ కష్టమే బీజేపీనీ 4 నుంచి 48 స్థానాల దగ్గర నిలబెట్టింది.

కొంపముంచిన వరదసాయం:

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరం అతలాకుతలమయ్యింది. అనేక కాలనీలు నీట మునిగాయి. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పది వేల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. అయితే ఆ పరిహారం చాలా మందికి అందకముందే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీంతో మీ సేవ ద్వారా వరద సాయం ఇచ్చినప్పటికి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున దానికి కూడా బ్రేక్ పడింది. దీంతో నష్ట పరిహారం అందని చాలా మంది టీఆర్ఎస్‌కు ఓటు వేసి ఉండకపోవొచ్చు.

బెడిసికొట్టిన కేసీఆర్ వ్యూహం:

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిపాలవ్వడంతో గ్రేటర్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. బీజేపీ మరింత పుంజుకోకముందే ఎన్నికలు జరిపించాలని భావించారు. అందుకే ప్రతిపక్షాలు సిద్ధం కాకముందే అస్త్రశస్త్రాలన్నీ రెడీ చేసుకుని కేవలం పదిరోజుల సమయంతోనే ఎన్నికలకు సిద్దమైపోయరు గులాబీదళపతి. రెండు నెలలు ముందుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మేలు జరుగుతుందని కేసీఆర్ భావించినప్పటికి అది కాస్త బెడిసికొట్టింది.

ఇక బీజేపీ అగ్ర నేతలంతా హైదరాబాద్ వచ్చి గ్రేటర్ ప్రచారంలో పాల్గొంటే, టీఆర్ఎస్ నుంచి మాత్రం కేటీఆర్ ఒక్కరే రోడ్ షోలలో పాల్గొంటూ ప్రచారం నిర్వహించారు. ఇది కూడా టీఆర్ఎస్‌కు ఒక మైనస్ అయ్యిందని చెప్పాలి. ఇవే కాకుండా ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం, కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకత చూపించలేదన్న అపవాదు ఏర్పడడం కూడా ఒకింత కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఇది పక్కన పెడితే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా కేటీఆర్ భవిత్యంపై ప్రభావం చూపినట్టు తెలుస్తుంది. గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించిన తర్వాయి కేటీఆర్‌ను సీఎంగా చేయబోతున్నారంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాలు కేటీఆర్ సీఎం కలపై కూడా నీళ్లు చల్లాయి.