నాగార్జున సాగర్‌లో సీన్ రివర్స్.. బీజేపీకి షాక్ ఇచ్చిన టీఆర్ఎస్..!

Tuesday, March 30th, 2021, 04:44:26 PM IST

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ముందు బీజేపీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అసంతృప్త నేతలను పార్టీలోకి తీసుకుని వారికి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావించింది. అందుకే టీఆర్ఎస్ ప్రకటించే వరకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యూహత్మకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ దివంగత నేత నోముల నర్సింహయ్య కుమారుడికే టీఆర్ఎస్ అవకాశం కల్పించింది. అయితే ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించిన వారెవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు.

దీంతో చివరి నిమిషంలో బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్ నాయక్ పేరును ప్రకటించింది. ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. టీఆర్ఎస్ ఆశావాహులను లాక్కోవాలని భావించిన బీజేపీకి టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. బీజేపీలో టిక్కెట్ రాని వ్యక్తులపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు కడారి అంజయ్య. అయితే మరో బీజేపీ నాయకురాలు నివేదితారెడ్డి కూడా తనకే టిక్కెట్ వస్తుందని భావించి నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే బీజేపీ రవికుమార్ నాయక్‌కు టిక్కెట్ ఇవ్వడంతో వీరిద్దరు అసంతృప్తికి గురయ్యారు. వీరితో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరప్డంతో ఇద్దరు కూడా టీఆర్ఎస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.