నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం కసరత్తు చేపట్టింది. కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్కు చెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి జానారెడ్డి బరిలో ఉంటారని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన టీఆర్ఎస్ ఈ స్థానంలో ఖచ్చితంగా విజయం సాధించాలనే పట్టుదలతో కసరత్తు చేస్తుంది. గెలుపు గుర్రాన్నే బరిలోకి దింపాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. ముందుగా నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్‌ను బరిలోకి దింపాలని టీఆర్ఎస్ అదిష్టానం భావించినప్పటికి సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో నిల్చోవడంతో మళ్ళీ టీఆర్ఎస్ ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది.
అయితే నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలు కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల యాదవ్‌లు టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్‌లో ఎస్టీ ఓటర్లు అత్యధికంగా ఉండటంతో రామచంద్రు నాయక్ పేరును హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. 40వేలకు పైగా ఎస్టీ ఓటర్లు ఉండటంతో టీఆర్ఎస్ అధిష్టానం రామచంద్రు నాయక్ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది.