బీజేపీ కార్పోరేటర్‌పై కోర్టుకెక్కిన టీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్..!

Saturday, February 13th, 2021, 07:41:20 AM IST

గ్రేటర్ హైదరాబాద్‌లోని హస్తినాపురం బీజేపీ కార్పొరేటర్‌గా ఎన్నికైన బానోతు సుజాతపై టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పద్మానాయక్‌ కోర్టుకెక్కారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బానోతు సుజాత నామినేషన్‌ వేసిన సందర్భంలో అధికారులకు అందజేసిన అఫిడవిట్‌లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారని, ఈ విషయాన్ని తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. 1995 తర్వాత ముగ్గురు పిల్లలు కలిగిన వారు ఎన్నికలలో పోటీకి అనర్హులనే నిబంధనను ఆమె ఉల్లంఘించినదని పద్మానాయక్ అన్నారు.

అయితే దీనిపై పూర్తి ఆధారాలతో గత డిసెంబర్‌ 7న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి, కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు చేసినట్లు పద్మానాయక్‌ తెలిపారు. డిసెంబర్‌ 15న సుజాతను అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ సిటీ సివిల్‌ కోర్టులో కేసు వేశామన్నారు. అంతేకాదు బానోతు సుజాతపై ఫిబ్రవరి 2న ఎల్‌బీనగర్‌ పీఎస్‌లో, ఫిబ్రవరి 3న ఎల్‌బీనగర్‌ డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవల దీనిపై తాము హైకోర్టును కూడా ఆశ్రయించామని అయితే మూడు నెలల్లో కేసును విచారణ జరిపి పూర్తి చేయాలని ఈ నెల 8న సిటీ సివిల్‌ కోర్టును న్యాయమూర్తి ఏ.అభిషేక్‌రెడ్డి ఆదేశించారని పద్మానాయక్‌ తెలిపారు.