మున్సిపల్ ఎలక్షన్స్: రెబల్ అభ్యర్థులకు షాక్ ఇవ్వబోతున్న టీఆర్ఎస్..!

Wednesday, January 15th, 2020, 08:00:23 PM IST

తెలంగాణలో ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా ఎవరికి వారు ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. అయితే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. సొంత పార్టీలోని నేతలే రెబల్స్‌గా బరిలోకి దిగుతుండడంతో పార్టీకి నష్టం చేకూరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే ఎమ్మెల్యేలు, మంత్రులు రంగంలోకి దిగి పలువురు రెబల్స్‌ని బుజ్జగించగా, ఇకపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్వయంగా కొందరికి ఫోన్ చేసి మరీ ఇతర పదవులపై హామీ ఇస్తూ కొందరిని బుజ్జగించారట. అయితే కొందరు నేతలు మాత్రం పోటీ నుంచి తప్పుకునేందుకు ఒప్పుకోక పోగా తాము ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని స్పష్టం చేశారట. అయితే మాజీ ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో స్థానికంగా మెజార్టీ ఉన్న అభ్యర్థులు స్వతంత్ర్యంగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారట. ఈ నేపధ్యంలో రెబల్స్ వల్ల పార్టీ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండడంతో వారందరిపై సస్పెన్షన్ వేటు వేయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుందని సమాచారం.