తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి – TPCC డిమాండ్

Thursday, October 22nd, 2020, 03:00:43 AM IST


గత కొద్ది రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర ఆస్తి, పంట నష్టం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నాళాలు, చెరువులు పొంగిపొర్లడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలలో అనేక కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసిన ప్రభుత్వం, వరద బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది.

అయితే తాజాగా ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీకి TPCC డిమాండ్ చేసింది. అటు వరదల సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 500 కోట్లను, 5 వేల కోట్లకు పెంచాలని TPCC ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్, తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండా సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు.