సీఎం కేసీఆర్ పై తీవ్రగ్రహం వ్యక్తం చేస్తున్న టీపీసీసీ చీఫ్…?

Friday, May 22nd, 2020, 08:42:24 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రంలోని రైతులందరికీ ఉపయోగపడేలాగా సరికొత్త వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ నూతన పద్ధతిపై ఇప్పటికే ప్రతిపక్షాల నుండి పలు విమర్శలు వెలువడుతున్నాయి. కాగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానం రాష్ట్రంలో తుగ్లక్‌ పాలనను మరిపిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. కాగా ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో రైతుబంధు పథకాన్ని ప్రారంభించామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ ఇప్పుడు ఆ పథకాన్ని ఎగ్గొట్టడానికి సీఎం కేసీఆర్ కొత్తరకమైన కుట్రలకు పాల్పడుతున్నాడని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

అంతేకాకుండా రాష్ట్ర పరంగా కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పత్తి కొనుగోళ్లు తగ్గిస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం పత్తి పంట విస్తీర్ణం పెంచాలనడం ఏమిటని పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా రైతులు పండించే పంటల విషయంలో కందులు, మినుముల కొనుగోలుకు మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ప్రకటించాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్‌ చేశారు.కాగా రైతులకు అందగాఉంటామని తెలంగాణ రాష్ట్ర తెరాస ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, కానీ దానికి వ్యతిరేకంగా దారుణమైన మోసాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.