అరకు ఘాట్ రోడ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు..!

Friday, February 12th, 2021, 10:40:09 PM IST


విశాఖ జిల్లా అరకులో ఘోర ప్రమాదం జరిగింది. అనంతగిరి మండలం డముకలో ఐదో నెంబర్ మలుపు దగ్గర టూరిస్ట్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 25 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 38 మంది వరకు పర్యాటకులు ఉన్నట్లు సమాచారం.

అయితే ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్‌ షేక్‌పేటకు చెందిన దినేష్ ట్రావెల్స్‌‌దిగా గుర్తించారు. బస్సులోని ప్రయాణికులందరూ తెలంగాణలోని నల్గొండ జిల్లా వాసులుగా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన మలుపు హెయిర్ పిన్ మాదిరి ఒంపుగా ఉండటం, బస్సు డ్రైవర్‌కు దానిపై అవగాహన లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బస్సు దాదాపు 350 అడుగుల లోతులో పడిపోవడం, పూర్తి చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు చాలా సమయం పట్టింది. ఇదిలా ఉంటే ప్రమాదంలో గాయపడ్డవారిని విజయనగరం జిల్లా ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.