తెలుగు రాష్ట్రాల మధ్య ఫలించిన ఆర్టీసీ చర్చలు.. నేటి రాత్రి నుంచే బస్సులు..!

Monday, November 2nd, 2020, 07:50:19 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. లాక్‌డౌన్ దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. అనంతరం కరోనా ఉధృత్తి తగ్గి అన్‌లాక్ ప్రక్రియ మొదలైనా బస్సు సర్వీసులు మాత్రం ప్రారంభం కాలేదు. పలుమార్లు రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగినా అవి ఫలించలేదు. అయితే తాజాగా నేడు మరోసారి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు భేటీ అయ్యి ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఏపీలో 826 బస్సులను 1,61,258 కిలోమీటర్ల మేర టీఎస్‌ ఆర్టీసీ నడపనుండగా, తెలంగాణలో 638 బస్సులను 1,60,999 కిలోమీటర్ల మేర ఏపీ ఆర్టీసీ నడపనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ఎంవోయూపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో నేటి రాత్రి నుంచే రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఏదిఏమైనా ఇన్ని రోజుల నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణీకులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం అనే చెప్పాలి.